Monday, September 9, 2013

ప్రజా కవి కాళోజి- Poets

ప్రజా కవి కాళోజి

కవిగూడ నేతగాడే -కాళోజి

కవి గూడ నేతగాడే

బహు చక్కని సాలెగూడు అల్లువెడే

రాజకీయ బల్లీ(యు)ల

నోటికి అందక ఎగిరెడి పక్షీ(యు)ల

చూపుల కనుపించనట్టి

సుకుమారపు సూత్రాలతొ -

బహు చక్కని సాలెగూడు అల్లువాడె

కవి గూడ నేతగాడె

రాజకీయ బల్లీ(యు)ల

రక్తసిక్త హస్తాలతొ ఎగరేసిన

తెలతెల్లని కపోతాలు వాలగ, కూర్చొని పాడగ

కైత; సింగిణీల దీర్చు

కవి గూడ నేత గాడె

బహు చక్కని సాలెగూడు అల్లువాడే

–కాళోజి (1972)

బ్రతుకు -కాళోజి 

సాగిపోవుటె బ్రతుకు

ఆగిపోవుటె చావు

సాగిపోదలచిన

ఆగరాదిచటెపుడు

ఆగిపోయిన ముందు

సాగనే లేవెపుడు

వేచియుండిన పోను

నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు

త్రోసుకొని పోవలయు.

బ్రతుకు పోరాటము

పడకు ఆరాటము.

బ్రతకదలచిన పోరు

సుతరాం తప్పదు.

చూపతలచిన జోరు

రేపనుట ఒప్పదు.

-కాళోజి


శాస్త్రం పద్ధతి -కాళోజి

శాస్త్రం పద్ధతి చెపుతుంది

ఆచరణ బ్రతుకు చాటుతుంది

శాస్త్రం ఆదర్శం వల్లె వేస్తుంది

ఆచరణ సాధ్యం నిరూపిస్తుంది

వ్యాకరణం రాజబాట వేస్తుంది

వాడుకు పిల్లబాట తొక్కుతుంది

సమ్మత రూపదర్శనాభిలాషి పండితుడు

అగుపడ్ద రుపమె సమ్మతము సామాన్యునికి

ఎవనికో నచ్చునట్లు పలకడం నాడు

ఎవనికి వాడు వచ్చినట్లు పలకడం ఖాయం నేడు

ఎదుటి వానికి తెలిసిందా? అనే ప్రశ్న

పలికే వాడు వేసుకోవలసింది

వినేవాడు కాదు

-కాళోజి


దేవుడు -కాళోజి

దేవుడు దేవుడు దేవుడు

దేవుడు లేందెవరికి?

ఎవరి దేవుడు వారికి

మనిషి మనిషి కొక్కొక్క మనసు

మనసు మనసు కొక్కొక్క దేవుడు

ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దేవుడు

ఎప్పుడూ ఏదో ఒక దేవుడు

పిపీలికం నుండి బ్రహ్మ పర్యంతం దేవుడు

అన్ని సుఖాలకూ మూలభూతం దేవుడు

అన్ని దుఃఖాలకు మూలబిజం దేవుడు

బ్రతుకంతా దేవుళ్ళ సంఘర్షణ

మనం జేస్తున్నది దేవుళ్ళకు ఆత్మార్పణ

దేవుడు లేకుంటే ఏ చిక్కూ లేదు

దేవుడు లేకుంటే బ్రతుకే లేదు

ఒకరి దేవుడు మరొకరి దేవుడు తీరిస్తే

ఒకరి దేవుడు తీరడంలో మరొకరి దేవుడు తీరుతే

రక్తి – ముక్తి.

–కాళోజి

దేవుడు దేవుడు దేవుడు

దేవుడు లేందెవరికి?

ఎవరి దేవుడు వారికి

మనిషి మనిషి కొక్కొక్క మనసు

మనసు మనసు కొక్కొక్క దేవుడు

ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దేవుడు

ఎప్పుడూ ఏదో ఒక దేవుడు

పిపీలికం నుండి బ్రహ్మ పర్యంతం దేవుడు

అన్ని సుఖాలకూ మూలభూతం దేవుడు

అన్ని దుఃఖాలకు మూలబిజం దేవుడు

బ్రతుకంతా దేవుళ్ళ సంఘర్షణ

మనం జేస్తున్నది దేవుళ్ళకు ఆత్మార్పణ

దేవుడు లేకుంటే ఏ చిక్కూ లేదు

దేవుడు లేకుంటే బ్రతుకే లేదు

ఒకరి దేవుడు మరొకరి దేవుడు తీరిస్తే

ఒకరి దేవుడు తీరడంలో మరొకరి దేవుడు తీరుతే

రక్తి – ముక్తి.

–కాళోజి


అందరివాడు -కాళోజి 

అందరి వాడైనవాడు

ఏ ఒక్కనికి అంకితమ్ము కాజాలడు

ఏ ఒక్కనికి అంకితమ్ము అయినవాడు

అందరికి అయినవాడు కానేరడు

అందరికి అయిన వాణ్ణి

ప్రతి ఒక్కడు నా వాడని

వాడు నావాడు కాకుండవుతున్నాడని

పడుచుండును ఆరాటము.

అందరి వాడైన వాడు

ఏ ఒక్కనికి అంకితమ్ము కాజాలడు

అందరి వాడైన వాడు

ఏ ఒక్కనికి

అన్ని తీర్ల అనుకూలుడు కాజాలడు

అందరి వాడైన వాణ్ణి

ప్రతి ఒక్కడు

అన్ని తీర్ల తనకే అనుకూలుడు కాదని పడు ఆరాటము

అంత తుదకు వపరీతము

యీ నడవడి పరిణామము

ఆరాటము తీరనట్టి ప్రతి ఒక్కడు

అందరి వాడైన వాణ్ణి

తనవాడసలే  కాదని

తరమి కొట్టి తృప్తి జెందు

అందరి వాడైన వాడు

ఏకాకే ఎల్లప్పుడు

అయినా అందరివాడె

ఏ ఒక్కనికి అంకితమ్ము కానివాడె.

కాళోజి


నలుబదైదు సంతకాల నటుడా? -కాళోజి

నా నోటికాడి బుక్కను

నాణ్యంగా కాజేసిన

నాగరికుడా ‘విను’

నా నాగటి చాలులోన

నాజూకుగ పవ్వళించి

నను కాటేసిన

నాగరికుడా విను?

నావారల చేరదీసి

నానా విధ బోధలతో

నాణ్యంగా నన్ను కొరిగి

నలుబదైదు సంతకాల

నాటకమాడిన నటుడా

నాగరికుడా విను!

కోటిన్నర మేటి ప్రజల

గొంతోక్కటి గొడవొక్కటి

తెలంగాణ వెలిగి నిలిచి

ఫలించెలె  భారతాన

భరత మాతాకీ జై

తెలంగాణ జిందాబాద్

-కాళోజి


ప్రాంతం వాడే దోపిడి చేస్తే

దోపిడి చేసే ప్రాంతేతరులను

దూరం దాకా తన్ని తరుముతం

ప్రాంతం వాడే దోపిడి చేస్తే

ప్రాణంతోనే పాతర వేస్తం

దోస్తుగ ఉండే వారితొ మేమును

దోస్తే చేస్తం – ప్రాణమిస్తం

ఎంతకు అంత అన్న ధోరణితో

చింతమాని బ్రతుకును సాగిస్తం

తెలంగాణమిది – తెలంగాణమిది

తీరానికి దూరాన వున్నది

ముంచే యత్నం చేస్తే తీరం

మునుగును తానే – మునుగును తప్పక

-కాళోజి


తెలంగాణ బాస -కాళోజి 

తెలంగాణ ‘యాస’ నెపుడు

యీసడించు భాషీయుల

‘సుహృద్భావన’ ఎంతని

వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు

ఇంగ్లీషు వాడుకుంటు

తెలంగాణీయుల మాటలో

ఉర్దూపదం దొర్లగానే

హిహీ అని ఇగిలించెడి

సమగ్రాంధ్ర వాదులను

ఏమనవలెనో తోచదు.

‘రోడ్డని’ పలికేవారికి

సడకంటె ఎవగింపు

ఆఫీసని అఘొరిస్తూ

కచ్చేరంటే కటువు

సీరియలంటే తెలుగు

సిల్సిల అంటే ఉరుదు

సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు

షర్కర్, నాష్తంట్ కొంప మునుగు

టీ అంటే తేట తెనుగు

చా అంటే ‘తౌరక్యము’

పొయినడంటే చావు

తోలడమంటే పశువు

దొబ్బడమంటే బూతు

కడప అంటే ఊరి పేరు

త్రోవంటె తప్పు తప్పు

దోవంటేనే దారి.

బొక్కంటే ఎముక కాదు

బొక్కంటె పొక్క తెలివి

మందలిస్తె తిట్టినట్లు

చీవాట్లు పెట్టినట్లు

పరామర్శ కానేకాదు

బర్రంటె నవ్వులాట

గేదంటేనే పాలు

పెండంటె కొంప మునుగు

పేడంటేనే ఎరువు

రెండున్నర జిల్లాలదె

దండి భాష తెలుగు

తక్కినోళ్ల నోళ్ల యాస

త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు

వహ్వారే! సమగ్రాంధ్ర

వాదుల ఔదార్యమ్ము

ఎంత చెప్పినా తీరదు

స్నేహము సౌహర్ద్రమ్ము

భోయి భీమన్న ఒకడు

తెనుగును రక్షించువాడు

భోయి భీమన్న ఒకడు

బెజవాడ గోపాలుని

సభ్యత నెర్గిన ఆంధ్రుడు

భోయీ భీమన్న ఒకడు

పదారణాల ఆంధ్రుడు

తెనుగు సభ్యత సంస్కృతి

ఆపాద మస్తకంబు

నోరు విప్పితే చాలు

తెనుగు తనము గుబాళించు

కట్టుబొట్టు మాట మంతి

నడక ఉనికి ఒకటేమిటి

ఎగుడు దిగుడు ఊపిరిలో

కొట్టొచ్చే తెనుగు తనము

గోపాల కీర్తనమే జీవిక

పాపము అతనికి

ఉర్డంటే మండి పడెడి

పాటి తెనుగు ఆవేశము

జౌనపదుని లేఖ లేవో

జౌఇన రహిత ప్రాయంబున

వ్రాసినాడు అంతెకాని

తెలివిన పడి, వృద్ధదశలో

కాస్మా పాలిటన్ తనము

శిఖరోహణ అనుకొని

పరిణతి దశ నందు కొనగ

తాపత్రయ పడుచున్నడు

భోయి భీమన్న ఒకడు

తెనుగును రక్షించువాడు

సమైక్యాంధ్రవాది వాడు

భీమశాస్ర్తి అని నాతో

పిలుపించు కొన్నవాడు

జానపదుని లేఖావళి

నాటి సఖుడు భీమన్న

-కాళోజి


కాటేసి తీరాలె –కాళోజి 

కాటేసి తీరాలెమన కొంపలార్చిన మన స్ర్తీల చెరచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరిచి పోకుండగ గురుతుంచుకోవాలె
కసి ఆరిపొకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకోట్టుచుండాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె
‘సత్యమ్మహింస’యని సంకోచ పదరాదు
‘దయయు ధర్మం’ బనుచు తడుముకో పని లేదు
‘శాంతి’యని చాటినను శాంతింపగా రాదు
‘క్షమ’యని వేడినను క్షమియింపగారాదు
‘చాణక్య నీతి’ నాచరణలో పెట్టాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె.
తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె
కొంగులాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలె
కన్ను గీటిన కళ్ల కారాలు చల్లాలె
తన్నిన కాళ్లను ‘డాకలి’గ వాడాలె
కండ కండగ కోసి కాకులకు వెయ్యలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె.–కాళోజి

మనిషి ఎంత మంచివాడు -కాళోజి 

మనిషి ఎంత మంచివాడు

చనిపొయిన వాని చెడును

వెను వెంటనే మరుస్తాడు

కని మంచినె తలుస్తాడు

మనిషి ఎంత చెడ్డవాడు

బ్రతికివున్న మనిషిలోని

మంచినెపుడు గుర్తించుడు

చెడును వెతికి కెలుకుతాడు

–కాళోజి


తినలేక/ తినలేక –కాళోజి

ఒకడు కుతికెలదాక

మెక్కినోడు

మరొకడు మింగు మెతుకు

లేనోడు

ఇద్దరికీ గొంతు పెకలదు

ఇద్దరికీ ఊపిరాడదు

ఇద్దరి అవస్థకు

ఒకే కారణం -

తినలేక

–కాళోజి


ప్రత్యేక తెలంగాణ అంటే –కాళోజి

ప్రత్యేక తెలంగాణ అంటే

పక్కలిరగ తన్నేందుకు

ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి

అధికారము ఎక్కడిది?

ప్రజాస్వామ్య రాజ్యాంగం

పరిపాలన గల దేశము

ప్రజా మతము ప్రకటిస్తె

పట్టి కొట్టి చంపేస్తద?

వేలు లక్షలు ప్రజలు

జేలుకేగ సిద్ధపడితే

ఏర్పట్లు చేయలేక

లాఠీచార్జి పరిపాలన?

కాడెద్దుల ధోరణిలో

కూడని పనియే లేదా?

వినిగి వేసారి జనం

హింసకాండ తలబెడితే

కేంద్రానిది బాధ్యతంత

‘ప్రెస్టేజి’ పేర హింస

ప్రభుత్వాన్కి సబబైతె

ప్రాణిధర్మ హింసకాండ

ప్రజలకు కూడా సబబే

బ్రహ్మన్న చంపు చంపు

ఏ పాటి చంవుతావో

తూటాలు ఎన్నున్నయో

పేల్చుకో, ఆబాలం గోపాలం

చంపు చంపు చంపు అనుచు

బరి రొమ్ములతో బజార్లో

తూటాలను ఎదురుతాన్రు

ఒకటో రెండో వుంచుకో

తుదకు ఆత్మహత్యకైన

అక్కరకొస్తె నీకు, లేకుంటే

ప్రాణాలతో ప్రజల చేతికే

చిక్కితే నీకున్నది కుక్కచావు

తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తా

భరతమాతాకీ జై

తెలంగాణ జిందబాద్.

–కాళోజి


నిర్వాకం –కాళోజి

నమ్ముకొని పెత్తనము ఇస్తే

నమ్మకము పోగొట్టుకొంటివి

కుప్పకావలి ఉండి కట్టలు

తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే

నోటినిండా మన్ను గొడ్తివి

పదవి అధికారముల బూని

పదిలముగ తల బోడి జేస్తివి

దాపునకు రానిస్తె చనువుగ

టోపి పెడితివి లాభపడితివి

అన్నవై తమ్ముళ్ల తలలను

నున్న జేస్తివి మురియబడితివి

తొత్తులను చుట్టూర జేర్చుక

పెత్తనాలు చేయబడితివి

‘పొచంపాడు’ పథకము

కూచికూచి చేసేస్తివి

‘దొంగ ముల్కి’ సనదులిచ్చి

దొరతనమ్ము వెలిగిస్తివి

తమ్ములను ఇన్నాళ్లబట్టి

వమ్మజేస్తివి తిన్నగుంటివి

ఎన్నిసార్లు మొత్తుకున్నను

అన్నవయ్యును గమ్మునుంటివి

అన్న అధికారమునకు తగిన

న్యాయబుద్దిని కోలుపోతివి

చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు

చిలుక పలుకలు పలుకుచుంటివి

–కాళోజి

No comments: